బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఎస్సీల అంటరానితనం పోతుందా?..సుప్రీం తీర్పును ఖండించిన  చింతా మోహన్

బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఎస్సీల అంటరానితనం పోతుందా?..సుప్రీం తీర్పును ఖండించిన  చింతా మోహన్

పంజాగుట్ట, వెలుగు: ఇటీవల ఎస్సీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీలు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వారి అంటరానితనం పోతుందా? అని ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయి స్థితిగతులపై ఢిల్లీ పెద్దలకు ఏం తెలుసని నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల పరిస్థితిపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని స్పష్టం చేశారు. 

మోదీ విదేశాంగ విధానం బలహీనం

ప్రధాని మోదీ బలహీన విదేశాంగ విధానం వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదని విమర్శించారు. యుద్ధం అనే అంశాన్ని ఎరగా చూపి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో రాజీవ్ గాంధీ భయంకర యుద్ధ పరిస్థితుల్లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్​తో మాట్లాడి యుద్ధాన్ని విరమింపజేశారని గుర్తు చేశారు.

మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, ఉత్తరాదిలో సీట్లు పెంచి దక్షిణాదికి అన్యాయం చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేంద్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.